ఈ కోటలోనే జాతీయ జెండా రూపకల్పన..
- నాటి చరిత్రకు సాక్షిగా నడిగూడెం రాజా వారి కోట
నడిగూడెం, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో 12 ఎకరాల విస్తీర్ణంలో నాయిని వంశస్థులు నిర్మించిన రాజా వారి కోట ప్రస్తుతం ఆలనా పాలనా లేక అలంకారప్రాయంగా మారింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ కోటకు సంబంధించిన పలు విషయాలు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచాయి. 1921లో పింగళి వెంకయ్య ఈ కోటలో వ్యవసాయ అధికారిగా పనిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పత్తి సాగును ప్రోత్సహించి, వ్యవసాయ శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. పత్తి పంటపై పరిశోధనలు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.

1895లో సుమారు 30 మెట్ల ఎత్తులో, 40 అడుగుల రాతి ప్రహరీ గోడతో ఈ కోటను నిర్మించారు. మైసూర్ నుంచి కూలీలను, బర్మా నుంచి టేకు కలపను తెప్పించి నాయిని వంశస్థులు కోట నిర్మాణాన్ని చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చి వ్యవసాయ అధికారిగా పనిచేసిన పింగళి వెంకయ్య మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించారని, విజయవాడలో జరిగిన మహాసభలో ఆ రూపకల్పనకు ఆమోదం లభించిందని చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురుతూనే ఉంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు నడిగూడెం కోటను సందర్శించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
నడిగూడెం కోటలో నిరుద్యోగులకు ఉపయోగపడే పాలిటెక్నిక్, ఐటీఐ వంటి సంస్థలు ఏర్పాటు చేస్తారనే ఆశలు నెరవేరలేదని మండల కేంద్రానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటలో దక్కన్ ఆర్కియాలజికల్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ (డాక్రీ) కొనసాగుతోంది. మునగాల మండల కేంద్రానికి చెందిన జితిన్ బాబు దీనిని నిర్వహిస్తున్నారు. గతంలో నాయిని వంశస్థులకు చెందిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కోటలో ఆస్పత్రి శాఖను ఏర్పాటు చేసి సేవలు అందించినట్లు స్థానికులు తెలిపారు.
