స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
- వృత్తి శిక్షణతో మహిళలకు స్వావలంబన
- కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నర్సాపురం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవా కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతున్నాయని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు.నర్సాపురం మండలం వేములదీవి ఈస్ట్ గ్రామంలో రాజు ట్రస్ట్ నిర్వాహకుడు తిరుమాని లక్ష్మీ నరసింహరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.
ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. రాజు ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ కార్యక్రమాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
40 రోజుల పాటు 15 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించి, అనంతరం ఉచితంగా మిషన్లు పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమమన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
కుట్టు మిషన్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సమాజ సేవా దృక్పథంతో మహిళల సాధికారత కోసం రాజు ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు.ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు తిరుమాని లక్ష్మీ నరసింహరాజును శాలువాతో సత్కరించారు. శిక్షణ పొందిన మహిళలు ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
