మురుగు కాలువలు, కల్వర్టు నిర్మాణంపై కాలనీవాసుల అభ్యంతరం
యడ్లపాడు, ఆంధ్రప్రభ: మండలంలోని బోయపాలెం నుంచి ఉన్నవ వరకు చేపట్టిన సీసీ రోడ్డు విస్తరణ, నూతన బీటీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణ పనులపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా బోయపాలెం పరిధిలో ఆక్రమణల తొలగింపు పనులు గుత్తేదారులకు సవాల్‌గా మారాయి. దీంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నెలల తరబడి పనులు కొనసాగుతున్నా పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆక్రమణలు తొలగించేందుకు కొన్ని ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తుతో చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రోడ్డు విస్తరణలో భాగంగా ఇటీవల నూలుమిల్లు దాటిన తర్వాత దక్షిణం వైపు అడ్డ బజారులోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపు కల్వర్టుపై కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కల్వర్టు పైపులను సరైన వాటంతో ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించే అవకాశం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా కల్వర్టుపై మట్టి పోసి పూర్తి చేయకుండా వదిలేయడంతో కాలనీలోకి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు.
దీంతో కాలనీవాసులే స్వయంగా మట్టిని పోసుకుని రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కల్వర్టును నాణ్యతతో పూర్తిచేయాలని కాలనీవాసి సాంబిరెడ్డి కోరారు.
