ఆపదలో అండగా సిరికొండ..

ఇద్దరికి గుండె శస్త్రచికిత్సలు.. నిమ్స్‌లో పరామర్శ
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి :
ఆపదలో ఉన్న వారికి కుటుంబ పెద్దలా అండగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలు అందేలా ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కృషి చేస్తున్నారు. జయశంకర్ జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన చింతల అనిల్‌ తల్లి సంపతమ్మకు గుండె సంబంధిత చికిత్స కోసం రూ.3.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించేందుకు కృషి చేశారు.

అదేవిధంగా భాగిర్తిపేటకు చెందిన దామోదర్‌ను నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు ఎల్‌ఓసీ మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదన లేఖ పంపించారు. గుండె సంబంధిత సీనియర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ అమరీష్‌తో నిరంతరం సంప్రదిస్తూ ఇద్దరికీ ఒకే రోజు మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ఇద్దరికీ విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు పూర్తవడంతో బుధవారం నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లిన మధుసూదనాచారి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.