విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి

భూత్పూర్, ఆంధ్రప్రభ: విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సూచించారు. భూత్పూర్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ్య చర్యలను బుధవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌.. ఆవరణలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పిచ్చిమొక్కలు, పొదలు, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ముఖ్యంగా పాములు దాగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పూర్తిగా శుభ్రం చేయాలని తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పాము కాట్ల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.