కరీంనగర్‌లో కత్తిపోట్ల కలకలం

లక్ష్మీనగర్‌లో యువకుడిపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

కరీంనగర్‌ క్రైం, ఆంధ్రప్రభ: కరీంనగర్‌లో వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. కిసాన్‌ నగర్‌ ఘటన మరువక ముందే కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌లో ఓ యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బత్తిని రాజు నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళతో కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ సంబంధాన్ని కొనసాగించవద్దని కుటుంబ సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో మహిళ, రాజు సోదరుడు బత్తుల నవీన్‌ మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణ తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో సదరు మహిళ మరో ఇద్దరు యువకులతో కలిసి నవీన్‌ ఇంటికి వచ్చి దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేయడంతో గాయాలైనట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఎస్ఐ శేఖర్ దర్యాప్తు చేపట్టారు.