బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే తన కుటుంబ రాజకీయ ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలకు స్పందించిన ఎంపీ చామల.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుటుంబ సభ్యులకు రాజకీయ ప్రాధాన్యం లభించిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు.
‘కుటుంబానికే రాజకీయ అవకాశాలు’ అంటూ విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1600 మందికి పైగా యువకులు బలిదానాలు చేశారని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబానికే రాజకీయ అవకాశాలు ఎక్కువగా దక్కాయని చామల ఆరోపించారు.అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ మంత్రి అయ్యారని, ఎమ్మెల్యేగా గెలవకుండానే హరీష్ రావు మంత్రి పదవి చేపట్టారని ఆయన విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వలేదని పేర్కొన్నారు. తనకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా ప్రజా పాలనకే ప్రాధాన్యం ఇస్తున్నారని చామల తెలిపారు.
భూముల కేటాయింపులపై కేటీఆర్‌కు కౌంటర్
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు భూముల కేటాయింపుల అంశంపై వస్తున్న విమర్శలను ఎంపీ చామల ఖండించారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటేనే భూమి కేటాయింపు జరిగిందని తెలిపారు. అదే సమయంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఎవరెవరికి భూములు కేటాయించారు.. ఏ సంస్థలకు అవకాశాలు కల్పించారనే వివరాలు తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడే ముందు గత ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించుకోవాలని సూచించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ను టార్గెట్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని చామల అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రాంతాల అభివృద్ధి, ప్రజల అవసరాల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచన
కుటుంబ విభేదాల కారణంగానే కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేశారంటూ చామల వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
