టర్కీ-సౌదీ-పాకిస్థాన్ రక్షణ ఒప్పందం.. భారత్‌కు కొత్త వ్యూహాత్మక సవాలా?

మక్కా సాక్షిగా కుదిరిన రక్షణ ఒప్పందం..

మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు

టర్కీ చేరికతో బలపడిన త్రైపాక్షిక రక్షణ వ్యవస్థ

సౌదీ భద్రతా ఆందోళనలు.. భారత్‌కు లభించే వ్యూహాత్మక అవకాశాలు

ఆగస్టు 7న మక్కా సాక్షిగా టర్కీ-సౌదీ అరేబియా- పాకిస్థాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కదానిపై సాయుధ దాడి జరిగినా, అది మూడింటిపైనా జరిగిన దాడిగానే పరిగణించబడుతుంది. సౌదీ అరేబియా, పాకిస్థాన్లు 2025లోనే ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు టర్కీ కూడా భాగస్వామిగా చేరడం ఈ రక్షణ వ్యవస్థకు ఎలాంటి అదనపు బలాన్ని చేకూరుస్తుంది? ఇలాంటి పరస్పర రక్షణ హామీలు సంక్షోభ సమయంలో అసలు ఎంతవరకు అక్కరకు వస్తాయి? అంతకంటే ముఖ్యంగా, పహల్గామ్ తరహా దాడి జరిగితే, భారత్ మరో సింధూర్ ఆపరేషన్ చేపట్టగలిగే స్వేచ్ఛను ఈ కొత్త రక్షణ వ్యవస్థ ప్రభావితం చేసే అవకాశాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

2026లో సౌదీ స్థావరాలపై ఇరాన్ దాడులు జరిగినప్పుడు, సౌదీ అరేబియా-పాకిస్థాన్‌ల మధ్య ఇదే తరహా పరస్పర రక్షణ ఒప్పందం అమల్లో ఉంది. అయినప్పటికీ, పాకిస్థాన్.. సౌదీ భద్రతకు కొంత సైనిక సహకారం అందించడంతో పాటు, దౌత్యపరంగానూ బహిరంగ మద్దతు ప్రకటించింది. అయితే ఇరాన్‌పై ప్రత్యక్ష దాడులకు మాత్రం దిగలేదు.

స్థూలంగా చూస్తే, ఇది నాటో ఒప్పందంలోని 5వ నిబంధనను పోలి ఉంటుంది. ఇదే విషయాన్ని టర్కీ విదేశాంగ మంత్రి ధ్రువీకరించారు. ఈ నిబంధన ప్రకారం, ఒక సభ్యదేశంపై సాయుధ దాడి జరిగితే మిగిలిన దేశాలు దానికి అండగా నిలవాల్సిన బాధ్యతను నాటో ప్రతిపాదిస్తుంది.

అయితే ఆ సహాయం తప్పనిసరిగా ప్రత్యక్ష సైనిక చర్య రూపంలోనే ఉండాలని నిర్దేశించదు. ప్రతి సభ్యదేశం అవసరమైనదిగా భావించే చర్యను నిర్ణయించుకోవచ్చు. ఆ కోణంలో చూస్తే, ‘ఒకరిపై దాడి అందరిపై దాడి‘ అనే హామీ ఆచరణలో ఎంత మేరకు, ఏ రూపంలో కార్యరూపం దాల్చుతుందన్న ప్రశ్నకు భవిష్యత్తు పరిణామాలే సమాధానం చెప్పాలి.


టర్కీ చేరికతో పెరిగిన సైనిక సామర్థ్యం

ఈ త్రైపాక్షిక ఒప్పందంలో టర్కీ చేరికను సాధారణ రాజకీయ భాగస్వామ్యంగా చూడలేం. నాటో కూటమిలో రెండో అతిపెద్ద సైనిక బలగాన్ని కలిగి ఉన్న టర్కీ, గత కొన్నేళ్లుగా స్వదేశీ డ్రోన్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలతో సహా గణనీయమైన రక్షణ సామర్థ్యాన్ని సమకూర్చుకుంది.

ఇప్పుడు ఆ దేశం సౌదీ అరేబియా, పాకిస్థాన్‌లతో ఒకే రక్షణ వ్యవస్థలోకి రావడం వల్ల ఈ సమీకరణానికి అదనపు సైనిక సామర్థ్యం తోడవుతుంది.

అయితే, టర్కీ నాటో సభ్యదేశం కావడం నిర్ణయాత్మకమైన అంశమే. భారత్‌తో ఏదైనా ప్రత్యక్ష ఘర్షణలో పాకిస్థాన్‌కు సైనికంగా అండగా నిలవాల్సి వస్తే, టర్కీ అమెరికాతో సహా నాటో దేశాలతో సంబంధాలను గుర్తెరగాల్సి ఉంటుంది.


సౌదీ భద్రతా ఆందోళనలు.. భారత్‌కు కొంత ఊరట

అదే సమయంలో, ఇరాన్‌తో పెరిగిన ఉద్రిక్తతలు, హౌతీల క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా తన మౌలిక వ్యవస్థలకు పొంచి ఉన్న ముప్పు సౌదీకి ఆందోళనగా పరిణమించింది.

కాబట్టి ఈ ఒప్పందం వెనుక పాకిస్థాన్‌కు మద్దతివ్వాలనే ఉద్దేశంతో పాటు, తన భద్రతను బలోపేతం చేసుకునే స్వతంత్ర ప్రయోజనం కూడా సౌదీకి ఉంది. ఈ రెండు అంశాలు భారత్ ఆందోళనను కొంతమేర తగ్గించేవే.


పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం.. కీలక అంశం

అయితే, ఈ ముక్కోణపు కూటమికి వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచే ప్రధాన అంశాల్లో పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఒకటి.

అణుబాంబును ఉపయోగించకుండానే, కేవలం అణ్వస్త్రాలను కలిగి ఉండటం కూడా ఒక దేశానికి నిరోధక శక్తి, వ్యూహాత్మక ప్రాధాన్యత, చర్చల్లో బేరసారాల సామర్థ్యం కల్పిస్తుంది.

పాకిస్థాన్ ఈ ప్రయోజనాన్ని సమర్థంగా వినియోగించుకున్నట్లు కనిపిస్తోంది.


చైనా పాత్రపై అనుమానాలు

అయితే, ఈ త్రికోణంలో చైనా కనిపించని నాలుగో సింహమై ఉండొచ్చనే సందేహం సహజంగానే తలెత్తుతుంది.

పాక్క చైనాకు అత్యంత సన్నిహిత భాగస్వామి. సౌదీతోనూ సంబంధాలను ఇటీవలి కాలంలో గణనీయంగా విస్తరించుకుంది.

ఈ మూడింటినీ ఒకే రక్షణ వ్యవస్థలోకి తీసుకురావడం చైనా పథకమేనని చెప్పడం తొందరపాటు. అయితే, వీటి మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాల ద్వారా పాకిస్థాన్‌కు అదనపు వ్యూహాత్మక వెసులుబాటు కల్పించడంలో చైనా పాత్రను పూర్తిగా కొట్టిపారేయలేం.


అమెరికా ప్రభావం ఎంతవరకు?

ఇక అమెరికా పాత్రను కూడా ఈ సమీకరణానికి దూరంగా ఉంచలేం.

టర్కీ నాటో సభ్యదేశం. సౌదీ అరేబియా అమెరికాకు కీలకమైన గల్ఫ్ భాగస్వామి. పాకిస్థాన్‌తోనూ వాషింగ్టన్ దశాబ్దాలుగా రక్షణ, భద్రతా సంబంధాలున్నాయి.


భారత్ ప్రతిస్పందన.. మరింత శక్తివంతమా?

పహల్గామ్ తరహా మరో ఉగ్రదాడి జరిగితే, భారత్ ప్రతిస్పందన సింధూర్ నాటి పరిస్థితి కంటే కొంత భిన్నంగా ఉంటుంది.

మునుపటి అనుభవంతో పాటు, ఆపరేషన్ సింధూర్ తర్వాత అత్యవసర ప్రాతిపదికన సమకూర్చుకుంటున్న డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, అధునాతన నిఘా, వైమానిక రక్షణ సాధనాలతో భారత్ గతంలో కంటే ఘాటైన జవాబు ఇవ్వగలదు.


సౌదీతో భారత్ సంబంధాలు.. వ్యూహాత్మక బలం

సౌదీ అరేబియాతో భారత్‌కు ఉన్న సంబంధాలు ఈ సందర్భంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.

భారత్‌తో రియాధ్‌కు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, ఇంధన, పెట్టుబడి సంబంధాలు గణనీయమైన స్థాయిలో ఉన్నాయి.

ఇలాంటి బహుముఖ సంబంధాలే భారత్‌కు ఉన్న అసలు వ్యూహాత్మక బలం.


సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే భారత్

సవాళ్లను తనకు అనుకూలంగా మలచుకోవడంలో భారత దౌత్యానికి గతంలోనూ కొన్ని మంచి ఉదాహరణలు ఉన్నాయి.

ప్రస్తుత పరిణామాన్ని కూడా అదే దృష్టితో చూడాలి.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ముందుచూపుతో, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే, పాకిస్థాన్ చుట్టూ ఏర్పడుతున్న ఈ కొత్త సమీకరణం భారత్‌కు సవాలుతో పాటు, తనకున్న దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించవచ్చు.