AP | రాష్ట్రంలో 66కు చేరిన కోవిడ్ కేసులు..
అల్లూరి జిల్లాలో మరో కేసు నమోదు.. ఆసుపత్రుల్లో 9 మంది చికిత్స
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 66కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 9 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 10 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న 43 మందిని ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వైరస్‌తో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. అవసరమైన పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలని సూచించారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
