బడి బాగుకోసం నేనున్నా..
50 టిప్పర్ల మొరంతో పాఠశాల ఆవరణ చదును
మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పెద్ద నాయకుడు లింగప్ప ముందుకు వచ్చారు. సుమారు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల ఆవరణలో గుంతలు ఏర్పడి, వర్షం కురిసినప్పుడు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాల ఆవరణలోని పరిస్థితిని గమనించిన ప్రధానోపాధ్యాయుడు ఆత్కూర్ నర్సిరెడ్డి సమస్యను గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన నాయకుడు లింగప్ప పాఠశాల ఆవరణలో గుంతలను పూడ్చేందుకు 50 టిప్పర్ల మొరం తెప్పించి, డోజర్‌తో చదును చేయించారు.
ఈ సందర్భంగా లింగప్ప మాట్లాడుతూ.. గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ పిల్లలేనని, వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన వంతు సహకారం అందించినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో గుంతలు పూడ్చేందుకు అవసరమైన మొరం తెప్పించి చదును చేయించామని చెప్పారు. గ్రామంలో ఏ సమస్య తన దృష్టికి వచ్చినా తనవంతు సహకారం అందిస్తానన్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా విని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు.
పాఠశాల ఆవరణలో మొరం వేయించి గుంతలను పూడ్చి చదును చేయించిన నాయకుడు లింగప్పకు ప్రధానోపాధ్యాయుడు ఆత్కూర్ నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు శివకుమార్, రమేష్, పవర్ధన్రెడ్డి, శ్రీకాంత్, పూజిత కృతజ్ఞతలు తెలిపారు.
