దేవాదులపై కడియం శ్రీహరికి అవగాహన లేదు: రాజయ్య
దళిత క్రైస్తవులపై వివక్ష చూపుతున్నారని ఆరోపణ..
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: దేవాదుల ప్రాజెక్టుపై కడియం శ్రీహరికి సరైన అవగాహన లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. హిందూ మతంలో ఉన్నప్పుడే దళితులకు ఎస్సీ హోదా కల్పించే విధానం కొనసాగడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. సిక్కులు, బౌద్ధులకు ఉన్న వెసులుబాటు దళిత క్రైస్తవులకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని రాజయ్య విమర్శించారు. టికెట్ల కేటాయింపు, ఎంపీ స్థానాల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారని, మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38 టీఎంసీల నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని రాజయ్య అన్నారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ నిండినా కాలువలకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో కడియం శ్రీహరికి పూర్తి అవగాహన లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపిస్తూ.. పార్టీ మారితేనే పనులు చేస్తామంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి వాటిని ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాల పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తనకు క్లిష్ట సమయంలో అండగా నిలిచారని గుర్తు చేసుకుంటూ రాజయ్య భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని, ప్రజల హక్కుల కోసం పోరాడుతామని, బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
