మరింత వేగంగా ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు..
- నేటి నుంచి 17208 రైలులో అమలు
- రేపటి నుంచి 17207 సర్వీసుకు వర్తింపు
- 20 ఆధునిక బోగీలతో కొత్త రూపు
- 120–130 కి.మీ. వేగానికి అనుకూలంగా
( విజయవాడ, ఆంధ్రప్రభ) : మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు మరింత భద్రత, సౌకర్యం కల్పించేలా ఆధునికీకరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ ద్వారా నడిచే 17208/17207 మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో ఇప్పటివరకు ఉన్న ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టారు. మంగళవారం నుంచి 17208 మచిలీపట్నం–షిర్డీ రైలుకు, బుధవారం నుంచి 17207 షిర్డీ–మచిలీపట్నం రైలుకు ఈ మార్పు అమల్లోకి వస్తుంది.
అత్యాధునిక సౌకర్యాలతో…
కొత్త రేకులో ఒక ఫస్ట్ ఏసీ, రెండు ఏసీ 2-టైర్, రెండు ఏసీ 3-టైర్, తొమ్మిది స్లీపర్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్, దివ్యాంగులకు అనుకూలమైన ఒక సెకండ్ క్లాస్ లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్, ఒక పవర్ కారుతో మొత్తం 20 కోచ్‌లు ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ప్రమాద సమయంలో బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కడం, పక్కకు తిరగడం, ఒకదానిలోకి మరొకటి చొచ్చుకుపోవడాన్ని నిరోధించే యాంటీ టెలిస్కోపిక్ సాంకేతికతను అమర్చారు. తేలికపాటి క్రోమ్ స్టీల్‌తో రూపొందించిన ఈ కోచ్‌లలో ఆధునిక గ్యాస్-హైడ్రాలిక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉండటంతో అధిక వేగంలోనూ సమర్థవంతమైన బ్రేకింగ్ సాధ్యమవుతుంది.
పెరగనున్న వేగం..
ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వల్ల రైలు రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు గంటకు 120–130 కిలోమీటర్ల వేగ సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థ పట్టాల నుంచి వచ్చే కుదుపులు, కంపనాలను తగ్గిస్తుంది. శబ్ద నియంత్రణ, విశాలమైన కిటికీలు, మెరుగైన లైటింగ్, సామాను ఉంచుకునే సదుపాయాలు ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తాయి. మైక్రోప్రాసెసర్ నియంత్రిత శీతలీకరణ వ్యవస్థ వాతావరణానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
