రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌..

  • 15 శాతం పెంపు కోరితే 3 శాతానికే ప్రభుత్వం ప్రతిపాదన
  • నేటి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అత్యవసరేతర సేవల బహిష్కరణ
  • ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో నిరసనలు
  • అత్యవసర, ఐసీయూ సేవలకు మినహాయింపు..
  • 15లోగా హామీ ఇవ్వాలని డిమాండ్‌

(విజయవాడ, ఆంధ్రప్రభ) : స్టైపెండ్‌ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్ల సంఘం (ఏపీజూడా) ఆందోళన బాట పట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటర్న్లు, పీజీలు, సీనియర్‌ రెసిడెంట్లు మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన జూనియర్‌ డాక్టర్లు.. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యవసరేతర వైద్య సేవలను బహిష్కరించారు.

స్టైపెండ్‌ను నిబంధనల ప్రకారం 15 శాతం పెంచాల్సి ఉండగా ప్రభుత్వం 3 శాతం పెంపునే ప్రతిపాదిస్తోందని జూనియర్‌ డాక్టర్లు తెలిపారు. ఈ అంశంపై సోమవారం ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చలు జరిపినా స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. పెంపుపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అత్యవసర సేవలకు మినహాయింపు..

ఆందోళనలో భాగంగా అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని ఏపీజూడా ప్రకటించింది. రోగులకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహిస్తామని తెలిపింది. విజయవాడలోని న్యూ జీజీహెచ్‌ వద్ద జూనియర్‌ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

15లోగా హామీ ఇవ్వాలి..

ఆగస్టు 12 నుంచి 15 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు చేపట్టనున్నట్లు సంఘం ప్రకటించింది. ఈనెల 15 సాయంత్రం 5 గంటల్లోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ రావాలని డిమాండ్‌ చేసింది. స్పందన లేకుంటే ఆగస్టు 17 నుంచి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. డీఆర్‌పీ, పెరిఫెరల్‌ పోస్టింగులను కూడా సమ్మె కాలంలో నిలిపివేస్తున్నట్లు ఏపీజూడా తెలిపింది.

న్యూ జిజిహెచ్ లో నిరసన..

తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ విజయవాడ న్యూ జిజిహెచ్ లో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద తన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్ల కోసం నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.