దోమలపై దుబ్యాల పంచాయతీ దండయాత్ర
టేకుమట్ల, ఆంధ్రప్రభ: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో మంగళవారం దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ సంగీ అంజలి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వీధులు, మురుగు కాలువలు, రద్దీ ప్రాంతాల్లో మందును పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
