ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో ఏటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో సుమారు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అంటే సగటున ప్రతి గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 66 శాతం మంది యువతే ఉండటం మరింత ఆందోళనకరమని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టానికి హెల్మెట్ ధరించకపోవడం కూడా ప్రధాన కారణంగా మారిందని గడ్కరీ తెలిపారు. గతేడాది హెల్మెట్ ధరించకపోవడం వల్లే 54,132 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు వేగాన్ని నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాన్నే మార్చేస్తుందని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ మరింత పెరగాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, అతివేగానికి దూరంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే విలువైన ప్రాణాలను కాపాడగలమని తెలిపారు.