సర్పంచ్‌ ఎన్నికల హామీలు నెరవేర్చాలి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామ సర్పంచ్‌ రాచకొండ విష్ణువర్ధిని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గ్రామ నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఎన్నికలు పూర్తై సుమారు ఆరు నెలలు గడుస్తున్నా ప్రధాన హామీలు అమలుకు నోచుకోలేదని వారు ఆరోపించారు.

ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు అంబులెన్స్‌ ఏర్పాటు, యువత కోసం వ్యాయామశాల ఏర్పాటు, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని సర్పంచ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలు ఆ హామీలను విశ్వసించి ఓట్లు వేసినప్పటికీ, వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శించారు.

అదేవిధంగా సర్పంచ్‌గా రాచకొండ విష్ణువర్ధిని కొనసాగుతున్నప్పటికీ, ఉప సర్పంచ్‌గా ఉన్న ఆమె భర్త శంకర్‌గౌడ్‌ గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. సర్పంచ్‌ భర్త పెత్తనం కొనసాగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ వ్యవహారాల్లో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కొనసాగించాలని కోరారు.

సర్పంచ్‌ ప్రజలకు, గ్రామపంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. హామీల అమలులో మరింత జాప్యం జరిగితే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగుల మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి, రాగుల లింబాద్రి, ఆకుల గంగాధర్, జంగం ప్రభు, రాగుల కిషన్, మాజీ ఎంపీటీసీ వల్లి, ముచ్కూర్ నరేష్, పల్లె మహిపాల్, సూల్ల భూమన్న, అయేటి రవీందర్, గురిజల రాజ గంగారం, దండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.