18 ఏళ్లుగా విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యాలు లేక అవస్థలు
‘మీకోసం’లో కలెక్టర్‌కు కుటుంబం వినతి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: బందరు కోటలోని 31/137-7 నంబరు ఇంట్లో నివసిస్తున్న కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, పాండురంగారావు కుటుంబాలు గత 18 ఏళ్లుగా విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
తమ ఇంటికి గత 18 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కిరోసిన్ దీపాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.
తాము నివసిస్తున్న స్థలానికి మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయం ద్వారా పట్టా మంజూరైందని, 1971లో సంబంధిత అధికారులు తమకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు. 1984 నుంచి మచిలీపట్నం మున్సిపాలిటీకి ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లిస్తున్నామని వివరించారు.
అయితే 2000 సంవత్సరంలో లోయ శ్రీనివాసరావు కొంతమంది అనుచరులతో కలిసి తమ ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని, ఈ సందర్భంగా ఇంటి గోడలు, విద్యుత్ మీటర్, మరుగుదొడ్డి గోడలను ధ్వంసం చేశారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని వాపోయారు.
తాము నివసిస్తున్న స్థలాన్ని ఇతరులకు కేటాయించినట్లు కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. తమ నివాసానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను చుట్టుపక్కల వారిని విచారించి, సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
గత 18 ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు తమ నివాస స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడి, విద్యుత్, మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినతిని స్వీకరించిన జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సానుకూలంగా స్పందించినట్లు బాధితులు తెలిపారు. సమస్యపై తక్షణమే పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం తహశీల్దార్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు తెలిపారు.
