ఆషాఢ సారెకు కొనసాగుతున్న భక్తుల రాక..

  • 27వ రోజు అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తుల సందడి
  • 37 సారె బృందాలు.. 16,984 మంది భక్తుల రాక
  • రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన మహిళా భక్తులు
  • సారె బృందాలకు ఉచిత దర్శనం.. ఆశీర్వచనం

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల్లో భాగంగా 27వ రోజు సోమవారం అమ్మవారి సన్నిధిలో మహిళా భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె వస్త్రాలతో పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.

సోమవారం 37 సారె బృందాల్లో 16,984 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సారె బృందాలకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత దర్శనం, ఆశీర్వచనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తులు సంప్రదాయబద్ధంగా సారె సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.