వైభవంగా శ్రీ చిన్నజీయర్‌ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు

దస్తూరాబాద్ ఆంధ్రప్రభ: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని దస్తూరాబాద్‌ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఈ ఉత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు పంపిన వెయ్యి పవిత్ర కలశాల్లో ఒకటి దస్తూరాబాద్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంది. పవిత్ర కలశానికి స్వాగతం పలికేందుకు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

గ్రామస్తులు, భక్తులు భక్తిశ్రద్ధలతో కలశాన్ని ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం మంగళహారతులు, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

చిన్నజీయర్‌ స్వామి తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా పవిత్ర కలశం తమ ఆలయానికి చేరుకోవడం విశేషమని గ్రామస్తులు పేర్కొన్నారు.