పేదల ఇంటికే సంక్షేమ ఫలాలు..

  • కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి
  • పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న
  • ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా
  • పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్‌ పథకాలతో లబ్ధి
  • నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై హర్షం

( భవానిపురం, ఆంధ్రప్రభ ) ; కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. సోమవారం 51వ డివిజన్‌ వాగులో డివిజన్‌ అధ్యక్షుడు కుంచెం దుర్గారావు, ప్రధాన కార్యదర్శి బెవర రవికుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్‌ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. పర్యటనలో భాగంగా ఓ నాయీ బ్రాహ్మణుల సెలూన్‌ వద్దకు చేరుకున్న వెంకన్నను దుకాణ యజమాని ఆపి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తుండటంతో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లెల ఈశ్వరరావు, సీనియర్‌ మహిళా నాయకురాలు బంక నాగమణి, నగరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సుకాసి కిరణ్‌కుమార్‌, పార్టీ నాయకులు, డివిజన్‌ ప్రతినిధులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.