రైల్వే స్టేషన్‌లో 13 సెల్‌ఫోన్లతో వ్యక్తి అరెస్ట్‌

రూ.2 లక్షల విలువైన మొబైళ్ల స్వాధీనం

కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ: విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న జీఆర్పీ పోలీసులు 13 సెల్‌ఫోన్లతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రెండు చోరీ కేసులకు సంబంధించిన సెల్‌ఫోన్లతో పాటు మరో 11 గుర్తుతెలియని మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

రైల్వే ఐజీపీ రాజకుమారి ఆదేశాల మేరకు, విజయవాడ రైల్వే జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌సింగ్‌ సూచనలతో డీఎస్పీ ఆర్‌.జి. జయసూర్య పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. విజయవాడ జీఆర్పీ సీఐ జె.వి. రమణ ఆధ్వర్యంలో జీఆర్పీ సిబ్బంది, ఆర్పీఎఫ్‌ సీఐ ఆలీబేగ్‌ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ప్లాట్‌ఫాం నంబర్‌ 10 ఉత్తర దిక్కున ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన విజయవాడ కుమ్మరిపాలెం మసీద్‌ రోడ్డుకు చెందిన షేక్‌ గౌసి (45)ని అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా 13 సెల్‌ఫోన్లు బయటపడ్డాయి.

వాటిలో ఒకటి రూ.50 వేల విలువైన వన్‌ప్లస్‌ ఫోన్‌, మరొకటి రూ.15 వేల విలువైన రెడ్‌మీ 5జీ ఫోన్‌గా గుర్తించారు. ఈ రెండు ఫోన్లు రెండు చోరీ కేసులకు సంబంధించినవిగా పోలీసులు తెలిపారు. వాటి మొత్తం విలువ రూ.65 వేలు ఉంటుందని పేర్కొన్నారు.

మిగిలిన 11 సెల్‌ఫోన్లకు సంబంధించి యజమానుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1.35 లక్షలుగా అంచనా వేశారు. దీంతో నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం 13 సెల్‌ఫోన్ల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ జె.వి. రమణతో పాటు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.