చెక్కకు ప్రాణం పోసే చేతికి చేయూత.. కళాకారులకు వుడ్‌ బ్యాంకులు

  • ఆరు క్లస్టర్లలో తొలి విడతగా ఏర్పాటు..
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక
  • లాభాపేక్ష లేకుండా కలప సరఫరా..
  • దళారుల ప్రమేయానికి చెక్‌
  • అటవీ సంరక్షణతోపాటు సంప్రదాయ కళాకారుల జీవనోపాధికి భరోసా

అమరావతి, ఆంధ్రప్రభ: సంప్రదాయ హస్తకళలకు ఊతమివ్వడంతోపాటు వాటిని తరతరాలకు అందించే కళాకారుల జీవనోపాధికి భద్రత కల్పించే దిశగా రాష్ట్ర అటవీశాఖ కీలక చర్యలు చేపడుతోంది. అటవీ సంరక్షణకు ప్రాధాన్యమిస్తూనే కళాకారులకు అవసరమైన కలపను సులభంగా, తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.

తొలి దశలో ఆరు క్లస్టర్ల పరిధిలో వుడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి ప్రాంతాల్లో సంప్రదాయ చెక్క కళలను కొనసాగిస్తున్న కళాకారులకు వీటి ద్వారా ముడిసరుకు అందించనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వుడ్‌ బ్యాంకుల కోసం భవనాల గుర్తింపు, గోదాముల ఏర్పాటుతోపాటు అవసరమైన కలప సేకరణ ప్రారంభమైంది. భవిష్యత్‌లో ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల క్వార్టర్స్‌ను వుడ్‌ బ్యాంకుగా మార్చారు. కొండపల్లి బొమ్మల తయారీకి కీలకమైన తెల్లపొణికి కలపను సేకరించే ప్రక్రియ మొదలైంది. నిరంతర సరఫరా కోసం తెల్లపొణికి స్థానంలో ఉపయోగించగల మృదువైన ఇతర కలప జాతులను కూడా అధికారులు గుర్తిస్తున్నారు.

ఏటికొప్పాకలో లక్క బొమ్మల కళాకారులకు త్వరగా సేవలు అందించేందుకు ప్రైవేట్‌ వాణిజ్య భవనాన్ని అద్దెకు తీసుకుని వుడ్‌ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొయ్యబొమ్మల తయారీదారులకు అందించేందుకు 1.5 ఘనపు మీటర్ల అంకుడు కలప సిద్ధంగా ఉంచారు.

అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్‌ సొసైటీకి చెందిన ఉమ్మడి సౌకర్య కేంద్రాన్ని వుడ్‌ బ్యాంకుగా గుర్తించారు. ఇక్కడ కళాకారుల కోసం 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల ఇతర కలప అందుబాటులో ఉంచారు.

తిరుపతి జిల్లా మాధవమాలలో చెక్క బొమ్మల కళాకారుల కోసం పాత ఎర్రచందనం డిపోను వుడ్‌ బ్యాంకుగా అభివృద్ధి చేయనున్నారు. సంప్రదాయ కలపతోపాటు నిబంధనలకు అనుగుణంగా ఎర్రచందనం కలపను కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 14.158 ఘనపు మీటర్ల నారియేపి, 8.495 ఘనపు మీటర్ల ఆకేసియా కటేచు కలపను సేకరించారు.

ఉదయగిరిలో కళాకారుల కోసం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి క్వార్టర్స్‌ను వుడ్‌ బ్యాంకుగా మార్చారు. బొబ్బిలి వీణల తయారీదారులకు అండగా నిలిచేందుకు గొల్లపల్లి క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను వుడ్‌ బ్యాంకుగా గుర్తించారు. ఇక్కడ 15.66 ఘనపు మీటర్ల పనస, రోజ్‌వుడ్‌ కలప సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ధవళేశ్వరంలో కేంద్ర వుడ్‌ బ్యాంకు..

వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వుడ్‌ బ్యాంకులకు అనుసంధానంగా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో కేంద్ర వుడ్‌ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ వెదురు బొంగులతోపాటు రోజ్‌వుడ్‌, టేకు వంటి కలపను అందుబాటులో ఉంచనున్నారు.

ఏలూరు జిల్లా కాపవరం ఎడ్ల బండ్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. అక్కడి కళాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టేకుతోపాటు ఇతర కలపను అందించేలా ప్రత్యేక వుడ్‌ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు.

లాభాపేక్ష లేకుండా కలప సరఫరా..

వుడ్‌ బ్యాంకుల ద్వారా కళాకారులకు నాణ్యమైన కలపను సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులను మాత్రమే కళాకారుల నుంచి వసూలు చేసే విధంగా ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

ముడిసరుకు కోసం దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా ప్రభుత్వం నేరుగా కలపను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కళాకారుల ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా కళాకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడంతోపాటు సంప్రదాయ కళలు భవిష్యత్‌ తరాలకు చేరే అవకాశం ఉంటుందని అన్నారు.

అరుదైన కలప జాతుల పెంపకానికి ప్రాధాన్యం

వుడ్‌ బ్యాంకులు కేవలం కలప నిల్వ కేంద్రాలుగా కాకుండా అటవీ వనరుల సుస్థిర వినియోగానికి ఉపయోగపడే వ్యవస్థగా ఉండాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. శాస్త్రీయ నిర్వహణ, అక్రమ కలప సేకరణకు అడ్డుకట్ట, కళాకారులకు అవసరమైన కలప జాతుల పునరుత్పత్తి, నర్సరీలు, తోటల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

అంకుడు, తెల్లపొణికి వంటి లభ్యత తక్కువగా ఉన్న కలప జాతులను ప్రత్యేకంగా అటవీశాఖ నర్సరీల్లో పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాలను అంచనా వేసి, అందుబాటులో ఉన్న వనరులను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

పారదర్శక నిర్వహణకు ఆదేశాలు

క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కలప సేకరణ, నిల్వ, ప్రాథమిక ప్రక్రియ, కళాకారులకు సరఫరా వరకు ప్రతి దశలో స్పష్టమైన విధానం ఉండాలని అన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చట్టబద్ధంగా లభించే కలప సేకరణ, నిల్వ, ప్రీ-ప్రాసెసింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులన్నింటినీ ఒకే తరహా నమూనాలో ఏర్పాటు చేయాలని పీసీసీఎఫ్‌ పి.వి. చలపతిరావుకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. నామఫలకాలు, లాగ్‌ రిజిస్టర్లు ఒకే విధమైన నమూనాలో ఉండాలని చెప్పారు. ఆయా క్లస్టర్ల ప్రత్యేకతను ప్రతిబింబించేలా స్థానిక సంప్రదాయ కళారూపాలను వుడ్‌ బ్యాంకులపై ప్రదర్శించాలని సూచించారు.

త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి

సంప్రదాయ కళాకారులకు అవసరమైన కలప నిరంతరం అందేలా వుడ్‌ బ్యాంకుల వ్యవస్థను బలోపేతం చేయాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని కళాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అటవీ వనరులను కాపాడుతూనే.. చెక్కకు కళారూపం ఇచ్చే చేతులకు అండగా నిలవడమే క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థ ద్వారా సంప్రదాయ కళలకు ముడిసరుకు భరోసా లభించడంతోపాటు కళాకారుల జీవనోపాధికి స్థిరమైన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.