కలిదిండి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్

  • డీఎస్సీపై 350 పిటిషన్లు వేసి ఉద్యోగాలు అడ్డుకునే కుట్ర
  • తప్పు చేసిన వారిని చితక్కొడతాం

.

కలిదిండి(ఏలూరు బ్యూరో), ఆంధ్రప్రభ: ఎన్నికల హామీ మేరకు డీఎస్సీ నిర్వహణపై తొలి సంతకం చేసి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు సుమారు 350 పిటిషన్లు కోర్టుల్లో దాఖలయ్యాయని తెలిపారు. కలిదిండి మండలంలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

డీఎస్సీ అభ్యర్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి, పోటీ పరీక్షలో విజయం సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు పాఠశాలల్లో విద్యార్థులకు ఎంతో చక్కగా విద్యాబోధన చేస్తున్నారని చెప్పారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై ఏడాది తర్వాత గొడ్డలి పార్టీ నేతలు మళ్లీ బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఢిల్లీలో నీట్‌ పేపర్‌ లీక్‌ జరిగిందని, అదే విధంగా రాష్ట్రంలోనూ జరిగిందంటూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని విమర్శించారు.

టీచర్లను అవమానించేలా వ్యవహరించిన వారిపై నిరసనగా ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారని చంద్రబాబు అన్నారు. “టీచర్లు చదువు చెప్పడమే కాదు.. తప్పు చేసిన వారిని చితక్కొట్టేందుకు కూడా రోడ్డుపైకి వచ్చారు. సిగ్గుంటే ఇకపై డీఎస్సీపై మాట్లాడరు” అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.