13న సీడ్‌ యాక్సెస్‌ రోడ్, స్టీల్‌ బ్రిడ్జిల ప్రారంభం

ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

గుంటూరు, ఆంధ్రప్రభ: ఈ నెల 13న గుంటూరులోని సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సోమవారం ప్రారంభోత్సవ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారుల పరిశీలన

ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న సభలో చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బందోబస్తుపై ప్రత్యేక దృష్టి..

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు సూచించారు. సభా ప్రాంగణం, ప్రారంభోత్సవ ప్రాంతం, రాకపోకల మార్గాల్లో పోలీసు బందోబస్తును సమర్థంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, చైర్‌పర్సన్ అధికారులకు సూచించారు. సభకు వచ్చే ప్రజలు సౌకర్యవంతంగా కూర్చునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీరమణి తదితర అధికారులు పాల్గొన్నారు.