శుభాకాంక్షల్లో సఖ్యత..పార్టీలో మాత్రం మౌనం!

గంపలగూడెం, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు,ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య విభేదాల అంశం చాలాకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.ఇరువర్గాల మధ్య రాజకీయంగా దూరం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

శుభాకాంక్షల్లో సఖ్యత..

ఎంపి చిన్ని పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా సందేశం ఇవ్వడం,అలాగే ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఎంపి చిన్ని కూడా శుభాకాంక్షలు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒకరినొకరు బహిరంగంగా శుభాకాంక్షలు తెలుపుకునేంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం,కార్యకర్తల ఐక్యత విషయంలోనూ అదే సానుకూలత ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం మంచి సంకేతమే.అయితే అది కేవలం సోషల్‌ మీడియా స్టేటస్‌లకు పరిమితం కాకుండా రాజకీయ సమన్వయానికి దారితీస్తేనే దానికి నిజమైన అర్థం ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

కలిసి పనిచేయలేరా?

రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమే.అయితే వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడం నాయకత్వ లక్షణంగా పార్టీ కార్యకర్తలు భావిస్తారు.ఎమ్మెల్యే,ఎంపి ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో వారి మధ్య సమన్వయం ఉంటే నియోజకవర్గానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

శుభాకాంక్షల సందర్భంలో పరస్పరం స్పందించగలిగిన ఇద్దరు నాయకులు పార్టీ కార్యక్రమాలు,కార్యకర్తల సమస్యలు,అభివృద్ధి అంశాలు, భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణలోనూ కలిసి అడుగులు వేస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని పలువురు కార్యకర్తలు కోరుకుంటున్నారు.వర్గాలతో బలం ఉండదు..ఐక్యతతోనే బలం అని గుర్తుంచుకోవాలి.

స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి..

నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్న విభేదాల ప్రభావం గ్రామ స్థాయి నాయకులు,కార్యకర్తలపై అధికంగాఉంది. నాయకులు ఎవరికి వారు తమ వర్గాలతో కార్యక్రమాలు నిర్వహించడం,పరస్పర సమన్వయం లేకపోవడం వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కార్యకర్తలు,నాయకులు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ అంతకుముందే విభేదాలను పరిష్కరించకపోతే అది పార్టీ బలోపేతానికి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది.

ఇద్దరూ కలిస్తే పార్టీకి లాభమే..

ఎమ్మెల్యేకు నియోజకవర్గ స్థాయిలో,ఎంపికు పార్లమెంట్‌ స్థాయిలో ఉన్న బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మరింత ఊతం లభించే అవకాశం ఉంటుంది.పార్టీ నాయకత్వం కూడా స్థానిక స్థాయిలో ఉన్న విభేదాలను చక్కదిద్దే దిశగా చొరవ తీసుకుంటే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది.

పరస్పరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్న నాయకులు రాజకీయ విభేదాలను వీడి ఒకే వేదికపై కలిసి పార్టీ బలోపేతానికి పనిచేసే విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారన్నదే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రధాన ప్రశ్నగా మారింది.శుభాకాంక్షలతో మొదలైన సానుకూల వాతావరణం సమన్వయానికి దారితీస్తుందా?లేక సోషల్‌ మీడియా సందేశాలకే పరిమితమవుతుందా?అనేది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.