చంద్రబాబుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆత్మీయ స్వాగతం

కలిదిండి, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి గ్రామంలో సోమవారం నిర్వహించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి వెనిగండ్ల రాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆత్మీయంగా స్వాగతించారు.

అనంతరం కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన 22-ఏ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభకు హాజరై సీఎం చంద్రబాబు కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. కలిదిండిలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూ హక్కులకు సంబంధించిన పత్రాల పంపిణీ చేపట్టారు. భూ సమస్యల పరిష్కారం, రైతులకు వారి భూములపై హక్కుల భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.