కాళేశ్వరం ఆలయ అభివృద్ధిపై ఎందుకీ విమర్శలు?

మహాదేవపూర్ ఆంధ్రప్రభ: కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.198 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపడుతుంటే కొంతమంది విమర్శలు చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం ఎందుకో అర్థం కావడం లేదని ఆలయ చైర్మన్‌ అవధాని మోహన్‌ శర్మ అన్నారు. ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం మానుకుని నిర్మాణ పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.198 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ఆలయం అభివృద్ధి చెందితే కాళేశ్వరం గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు, వ్యాపారులు, భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

పాత ఆలయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే పునర్నిర్మాణం

1982లో నిర్మించిన పాత ఆలయ భవనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో కాళేశ్వరం ప్రజలకు, భక్తులకు తెలుసన్నారు. గర్భాలయం పరిస్థితి, ప్రహరీగోడ పలుమార్లు దెబ్బతిన్న ఘటనలు, భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తుల భద్రత, భవిష్యత్‌ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గ్రామ ప్రజల మనోభావాలకు గౌరవం ఇస్తూ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు.

గ్రామ ప్రజలు, ఆలయ ఈవో, పాలకమండలి సహకారంతోనే ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇల్లు శిథిలావస్థకు చేరినప్పుడు పాత భవనాన్నే పట్టుకుని ఉండకుండా దానిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించుకుంటామని, అదే విధంగా ప్రస్తుత ఆలయ నిర్మాణాన్ని తొలగించి మరింత వైభవంగా నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నామని వివరించారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయం

భక్తులకు దర్శనాలు, పూజా కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి పూజలు కొనసాగిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అందుబాటులో ఉన్న స్థలంలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన బాసర, భద్రాచలం, యాదాద్రి ఆలయాలు అభివృద్ధి చెందిన తీరును ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. ఆయా ఆలయాల అభివృద్ధితో సంబంధిత ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.

ఆలయాలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దు

కాళేశ్వరం ఆలయం అభివృద్ధి చెందుతుంటే కొంతమంది విమర్శలు చేయడం, ఫిర్యాదులు చేయడం సరికాదని మోహన్‌ శర్మ అన్నారు. దేవాలయాల అభివృద్ధిని రాజకీయాలకు వేదికగా మార్చకూడదని సూచించారు. రాజకీయాలు చేయాలంటే ఇతర అంశాలపై చేసుకోవచ్చని, ఆలయాలు, పాఠశాలలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు.

ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదన్నారు. ఫిర్యాదులు, విమర్శలతో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

శ్రావణమాసంలో భూమిపూజ

రాబోయే శ్రావణమాసంలో నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సుమారు ఆరు నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి నూతన ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

రాతి కట్టడాలతో అన్ని హంగులతో నూతన ఆలయాన్ని వైభవంగా నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం కాళేశ్వరం ఆలయం కొత్త రూపంలో భక్తులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ఆలయం ఎవరో ఒకరిది కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని ఆలయ చైర్మన్‌ అన్నారు. ఆలయం అభివృద్ధి చెందితే కాళేశ్వరం అభివృద్ధి చెందుతుందని, తద్వారా గ్రామ ప్రజలు, వ్యాపార వర్గాలు, భక్తులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అందువల్ల అభివృద్ధిని అడ్డుకోవడం మానుకుని, ఫిర్యాదులు, విమర్శలను పక్కనపెట్టి నూతన ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.