High-Tech-Signalling : పాత సిగ్నలింగ్‌కు సెలవు Andhra Prabha Exclusive Story
High-Tech-Signalling : పాత సిగ్నలింగ్‌కు సెలవు Andhra Prabha Exclusive Story
- గుల్లిపాడు ఇక సిగ్నల్ జంక్షన్
- దువ్వాడ–సామర్లకోట మధ్య రద్దీకి బ్రేక్
- 955 మీటర్ల అదనపు లూప్ లైన్
- ఇక నాలుగు రైళ్లకే అంతరాయం..
- శరవేగంగా పనులు చకచక
(విజయవాడ ఆంధ్రప్రభ)

విజయవాడ డివిజన్‌లో రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక మౌలిక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ–దువ్వాడ మార్గంలోని గుల్లిపాడు స్టేషన్‌లో 955 మీటర్ల పొడవైన అదనపు లూప్‌లైన్‌తో పాటు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న మాన్యువల్ సిగ్నలింగ్ ప్యానల్ స్థానంలో ఆధునిక కంప్యూటర్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయడంతో రైళ్ల రాకపోకల్లో భద్రత, సామర్థ్యం, నిర్వహణ మరింత మెరుగుపడనుంది. సామర్లకోట–దువ్వాడ కీలక రైలుమార్గంలో ఉన్న యార్డు పరిమితులు తొలగడంతో డౌన్ లైన్‌పై ఉన్న గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితికి సంబంధించిన అవరోధాలు కూడా తొలగనున్నాయి.
High-Tech-Signalling : రైల్వే సమన్వయానికి…

గుల్లిపాడు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అదనపు లూప్‌లైన్ 955 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఇప్పటికే ఉన్న లూప్‌లైన్‌ను మరో 340 మీటర్లు పొడిగించి 1,026 మీటర్లకు చేర్చారు. ఈ పనుల్లో భాగంగా మూడు కొత్త ట్రాక్ స్విచ్‌లను ఏర్పాటు చేయగా, మరో రెండు స్విచ్‌లను మార్పుచేశారు. వంపులో ఉన్న ఒక స్విచ్‌ను తొలగించారు. అదనంగా నిర్మించిన పట్టాలు, క్రాసింగ్‌లకు విద్యుదీకరణ పనులు కూడా పూర్తిచేశారు. దీంతో స్టేషన్‌లో రైళ్లను నిలిపి ఉంచడం, రైళ్లను పక్కదారి పట్టించడం, రాకపోకలను సమన్వయం చేయడం మరింత సులభతరం కానుంది.
High-Tech-Signalling : అత్యాధునిక ఇంటర్ లాకింగ్..

దక్షిణ కోస్తా రైల్వేలో తొలిసారి మెధా ఏం ఈ 634 ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను గుల్లిపాడు స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. పాత యాంత్రిక సిగ్నలింగ్ ప్యానల్‌కు బదులుగా కంప్యూటర్ ఆధారిత ఆధునిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది తక్కువ స్థలంలో ఏర్పాటు చేయగలిగేలా ఉండటంతో పాటు విశ్వసనీయత, నిర్వహణ సౌలభ్యాన్ని పెంచుతుంది. రెండు స్థాయిల ప్రత్యామ్నాయ భద్రతా నిర్మాణంతో కూడిన డిజిటల్ నెట్‌వర్క్, డిజిటల్ యాక్సిల్ కౌంటర్లతో అనుసంధానమై పనిచేసే ఈ వ్యవస్థ సిగ్నలింగ్ అందుబాటును పెంచడంతో పాటు రైళ్ల రాకపోకల్లో భద్రతను మరింత బలోపేతం చేయనుంది.
High-Tech-Signalling : గేటు నిర్వహణలోనూ…
స్టేషన్‌లోని రోడ్ గేటు నిర్వహణలోనూ ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. గతంలో మాన్యువల్‌గా నిర్వహించే లాక్ బూమ్ స్థానంలో ఆటోమేటిక్ విద్యుత్ ఆధారిత లిఫ్టింగ్ బ్యారియర్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో గేట్లను వేగంగా నిర్వహించేందుకు ఎమర్జెన్సీ స్లైడింగ్ బూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో రైల్వే గేట్ల వద్ద రోడ్డు వాహనాల రాకపోకలను వేగంగా, సురక్షితంగా నియంత్రించే అవకాశం ఏర్పడింది.
High-Tech-Signalling : కీలక పనులు పూర్తి…
ఆగస్టు 8న మధ్యాహ్నం 1.05 గంటల నుంచి 2.45 గంటల వరకు ట్రాఫిక్ బ్లాక్ తీసుకుని కీలక పనులను పూర్తి చేశారు. ఇందుకు ముందు ఐదు రోజులపాటు సన్నాహక పనులు నిర్వహించారు. మొత్తం పనులను నిర్దేశించిన ఆరు గంటల వ్యవధిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టినప్పటికీ, పనులు వేగంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా కేవలం నాలుగు రైళ్ల రాకపోకలకు మాత్రమే అంతరాయం ఏర్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
High-Tech-Signalling : రైల్వేకు అదనపు బలం…

విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ విజయవాడ–దువ్వాడ మార్గంలో గుల్లిపాడు స్టేషన్ వద్ద చేపట్టిన ఈ అభివృద్ధి పనులు రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. అదనపు లూప్‌లైన్, నూతన సిగ్నలింగ్ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు రైళ్ల రాకపోకలు మరింత సురక్షితంగా, సమర్థంగా సాగుతాయని పేర్కొన్నారు. సురక్షితమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాల దిశగా ఇది మరో కీలక ముందడుగని అన్నారు. ప్రయాణికులకు కనీస అంతరాయంతో సంక్లిష్టమైన పనులను సకాలంలో పూర్తి చేసిన ఇంజినీరింగ్, ఆపరేటింగ్, విద్యుత్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్, సిగ్నల్ అండ్ టెలికాం విభాగాల అధికారులు, సిబ్బందిని డీఆర్‌ఎం అభినందించారు.
