అమరావతి పికిల్‌బాల్ విజేత కేసిస్

  • దాసోస్‌పై 4–1తో విజయం.. రూ.4 లక్షల ప్రైజ్‌మనీ కైవసం

విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని నోవాటెల్ సమీపంలోని నైట్రో పికిల్‌బాల్ కేఫ్‌లో గత మూడు రోజులుగా హోరాహోరీగా జరుగుతున్న అమరావతి పికిల్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ఉత్కంఠభరితంగా ముగిసింది. దాసోస్, కేసిస్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేసిస్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి 4–1తో సిరీస్‌ను కైవసం చేసుకుని అమరావతి పికిల్‌బాల్ విజేతగా నిలిచింది.

మూడు రోజుల పాటు ఎనిమిది జట్ల మధ్య సాగిన ఈ టోర్నమెంట్‌లో జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్ పోరులో దాసోస్, కేసిస్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడటంతో నైట్రో పికిల్‌బాల్ కేఫ్‌లో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు కేసిస్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి 4–1తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన కేసిస్ జట్టుకు రూ.4 లక్షల ప్రైజ్‌మనీ, రన్నరప్‌గా నిలిచిన దాసోస్ జట్టుకు రూ.2 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు.

బహుమతి ప్రదాన కార్యక్రమంలో సినీ నటి ఐశ్వర్య రాజేష్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొని విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో హీరో సుశాంత్ తల్లి, ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నాగ సుశీల (అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె), టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పికిల్‌బాల్ క్రీడకు యువతలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని తెలిపారు. అమరావతి, విజయవాడ ప్రాంతాలను పికిల్‌బాల్‌కు ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇటువంటి టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీలను నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగిన అమరావతి పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పికిల్‌బాల్ క్రీడకు అమరావతి వేదికగా నిలవడం పట్ల నిర్వాహకులు, క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.