డీఎస్సీపై వైసీపీ, కూటమి నేతల మధ్య రగడ

  • ఆదోనిలో ఉద్రిక్తత
  • వైసీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఎమ్మెల్యే పార్థసారథి యత్నం..
  • అడ్డుకున్న పోలీసులు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ అంశంపై వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేస్తూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆదోనిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని, బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

వైసీపీ నేతలు చర్చకు రాకపోతే తానే వైసీపీ కార్యాలయానికి వచ్చి మాట్లాడతానని ప్రకటించిన ఎమ్మెల్యే పార్థసారథి అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే వైసీపీ కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.

వైసీపీ తరఫున ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలు ఎదురుపడకుండా పోలీసులు పర్యవేక్షించారు.

ఎమ్మెల్యే తీరు సరికాదు: వైసీపీ

డీఎస్సీ నిర్వహించింది ఎమ్మెల్యే పార్థసారథి కాదని, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలోనే ప్రక్రియ జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. డీఎస్సీ అంశంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.