1004 కిలోల గంజాయి స్వాధీనం

  • ఒకరి అరెస్ట్.. మరో ముగ్గురు పరారీలో
  • అలంపూర్ సీఐ ప్రదీప్

ఎర్రవల్లి, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం సుల్తాన్‌పురం గ్రామంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 1004 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అలంపూర్ సీఐ ప్రదీప్ తెలిపారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన సుల్తాన్‌పురంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో సుల్తాన్‌పురం గ్రామంలోని ఓ శిథిలమైన గుడిసె వద్ద తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

ఈ కేసులో కర్నూలులో ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహిస్తున్న 26 ఏళ్ల ఈ. చంద్రకాంత్ గౌడ్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీసుల విచారణలో చంద్రకాంత్ గౌడ్ తన సోదరుడు ఈ. రవి చంద్ర గౌడ్‌తో పాటు నందికొట్కూరుకు చెందిన మరో ఇద్దరితో కలిసి గంజాయిని సేకరించి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైందన్నారు.

ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ తెలిపారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

పోలీసులు గంజాయితో పాటు డిజిటల్‌ వెయింగ్‌ మెషీన్‌, ప్లాస్టిక్‌ బాటిల్‌, స్ట్రా, ప్యాకింగ్‌ టేప్‌, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం–1985లోని సంబంధిత సెక్షన్ల కింద అలంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రదీప్ హెచ్చరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.