జిల్లాలో డీఎస్సీ వివాదం..

  • రోడ్డెక్కనున్న వైసీపీ.. అడ్డుకున్న పోలీసులు!
  • డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్‌..
  • లోకేశ్‌ రాజీనామా కోరుతూ ఆందోళనలు
  • నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలకు వైసీపీ పిలుపు
  • డీఎస్సీ సెగతో రాజకీయ వేడి.. వైసీపీ ర్యాలీలకు నో!
  • నేతలకు పోలీసుల నోటీసులు.. దేవినేని అవినాష్‌ ఇంటికి మాచవరం పోలీసులు

(విజయవాడ, ఆంధ్రప్రభ) : డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆందోళనలతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అయితే విజయవాడలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసుల ముందస్తు చర్యలు…

వైసీపీ పిలుపు నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొంటూ పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఇంటికి మాచవరం పోలీసులు వెళ్లి నోటీసులు అందజేశారు.

సీబీఐ విచారణకు డిమాండ్‌..

డీఎస్సీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఇందుకోసం సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని కోరుతోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో దశలవారి ఆందోళన చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సైతం దిగింది.

నియోజకవర్గాల్లో ఆందోళనలకు సిద్ధం…

డీఎస్సీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించింది. ఇప్పటికే జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ వైసీపీ పోరుబాట పట్టగా.. మరోవైపు అనుమతి లేని ర్యాలీలపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడం విజయవాడ లో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.