సీఎం పర్యటనను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలి

  • ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశాలు

కలిదిండి, ఆంధ్రప్రభ: కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే “మీ భూమి–మీ హక్కు” పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.

ఆదివారం కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల హెలిప్యాడ్, ప్రజావేదిక, తహశీల్దార్ కార్యాలయం, పార్కింగ్, రవాణా, భోజన ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం పర్యటనకు సంబంధించి ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి పక్కాగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని కోరారు. ఈ పర్యటనతో నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని అన్నారు.