ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శనీయం

  • భావితరాలకు అందించాలి : జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆదివాసీలు పాటిస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు సమాజానికి ఆదర్శనీయమని, వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఎస్పీ నీతికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలమణి, శాసనమండలి సభ్యులు దండే విఠల్‌, ఆసిఫాబాద్, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్‌, మున్సిపల్ చైర్మన్ ఆకాష్‌, వైస్‌ చైర్మన్ ఎండీ అహ్మద్‌, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదివాసీల సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తొమ్మిది తెగల అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం కుమ్రంభీమ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీలు ప్రపంచంలోనే పురాతన జాతుల్లో ఒకరని, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకమైనవని పేర్కొన్నారు.

గిరిజన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ఆదివాసీ యువత విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో గిరిజనుల సమస్యలను తెలుసుకుంటున్నామని, సంఘాల ప్రతినిధులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతి, జీవన విధానం, ఆచారాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పోలీసులు ఎల్లప్పుడూ ఆదివాసీల సంక్షేమానికి కృషి చేస్తారని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

శాసనమండలి సభ్యులు దండే విఠల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇంద్రవెల్లి స్మారక స్థూపం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు అమరవీరుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ.. ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, రహదారులు, విద్య, వైద్యం, ఇంటర్నెట్ సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను బలోపేతం చేసి ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులు, పీవీటీజీల అభివృద్ధికి పలు పథకాల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నీతికా పంత్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఎమ్మెల్యేలు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం గిరిజన మహిళలతో కలిసి దింసా నృత్యం చేసి ఆదివాసీలలో ఉత్సాహం నింపారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా కుమ్రంభీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. గిరిజన విద్యార్థులు, గుస్సాడీ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గిరిజన సంఘాల ప్రతినిధులు పలు సమస్యల పరిష్కారానికి వినతిపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.