విదేశీ నిధుల దుర్వినియోగానికి ఇక చెక్‌

మోత్కూరు, ఆంధ్రప్రభ: విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు దేశ భద్రతకు మరింత భరోసా కల్పించేలా ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రామచంద్రయ్య అన్నారు.

ఆదివారం మోత్కూరు మండల బీజేపీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ నిధుల ముసుగులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు.

విదేశాల నుంచి వచ్చే ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరి చేతుల్లోకి వెళ్తోంది? ఏ ప్రయోజనం కోసం ఖర్చవుతోంది? దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతోందా? అనే అంశాలపై స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో నిధుల పారదర్శకతకు వ్యతిరేకంగా నిలిచే వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, దేశ ప్రయోజనాల కంటే ఏ సంస్థ ప్రయోజనం గొప్పది కాదని రామచంద్రయ్య పేర్కొన్నారు. దేశాన్ని బలహీనపరిచే అనుమానాస్పద నిధుల ప్రవాహాన్ని అడ్డుకుని, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను బలోపేతం చేయడమే ఎఫ్‌సీఆర్‌ఏ సవరణల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

విదేశీ నిధుల పేరుతో దేశ ప్రయోజనాలను దెబ్బతీసే శక్తులకు ఇక అవకాశం ఉండకూడదని అన్నారు. పారదర్శకతను ప్రశ్నించే వారు తమ వైఖరిని ప్రజల ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలకు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోత్కూరు మండల బీజేపీ అధ్యక్షుడు గుదే మధుసూదన్ యాదవ్, నాయకులు సింగిరెడ్డి పురుషోత్తంరెడ్డి, పనకబండ ఉప సర్పంచ్ రాధారపు మల్లేశం, మండల ఉపాధ్యక్షుడు గుంటి సతీష్, బూత్ అధ్యక్షుడు నాని ఉపేందర్, ముక్కామల గణేష్ తదితరులు పాల్గొన్నారు.