ఇంద్రకీలాద్రిపై భక్తిరంజని..
- ఆధ్యాత్మిక సందడి నడుమ అలరించిన సంగీత విభావరి
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తిరంజని సంగీత విభావరి వైభవంగా జరిగింది. శ్రీ మల్లికార్జున మహామండపం ఏడో అంతస్తులోని కళావేదికపై జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కుప్పం, లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన శ్రీ వరదరాజులు స్వామి ఆస్థాన విద్వాంసులు ఎస్. నాగరాజు ఆధ్వర్యంలోని బృందం భక్తిరంజని గానకచేరీ నిర్వహించింది. నాదస్వరం, డోలు, శాక్సాఫోన్ వాయిద్యాల సమ్మేళనంతో ప్రముఖ సంకీర్తనలు, వర్ణనలను భక్తిభావంతో ఆలపించడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
నాదస్వరంలో ఎం.బి. గణేష్, సి.కె. మోహన్, శాక్సాఫోన్‌లో ఎన్. సుబ్రహ్మణ్యం, డోలులో ఎస్. కృష్ణమూర్తి తమ ప్రతిభను చాటారు. కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు సంగీత మాధుర్యంలో మైమరిచి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అనంతరం దేవస్థాన అధికారులు కళాకారులను అభినందించి, అమ్మవారి ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
