పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక వ్యాఖ్యలు

  • ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
  • గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి
  • అల్లూరి, బీర్సా ముండా వంటి పోరాట యోధుల సేవలను స్మరించుకోవాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
  • గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు సమాజానికి విలువైన సంపద: కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

గుంటూరు, ఆంధ్రప్రభ: గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్‌ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన అల్లూరి సీతారామరాజు, బీర్సా ముండా వంటి పోరాట యోధుల సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వసతులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, అవి సమాజానికి విలువైన సంపదలని అన్నారు. తరతరాలుగా వస్తున్న గిరిజన సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

గిరిజనుల సంక్షేమం, విద్య, వసతిగృహాలు తదితర సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గిరిజన నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు శ్రీను నాయక్‌, మేడా రామకృష్ణ, బాపట్ల ఏసుబాబు, చంద్రనాయక్‌, కట్ట వెంకటేశ్వర్లు, కే. కోటయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వందనాల దేవి, స్థానిక నాయకులు తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.