మలప్పురం అక్రమ పేలుడు పదార్థాల కేసులో మరో అరెస్ట్‌

  • ప్రధాన కుట్రదారుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ..
  • కేసులో 10కి చేరిన‌ అరెస్టుల సంఖ్య

మలప్పురం, ఆంధ్ర‌ప్ర‌భ : కేరళలోని మలప్పురంలో భారీగా అక్రమ పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో నిందితుడిని అరెస్టు చేసింది. మలప్పురం జిల్లా మంజేరిలో అతడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తి ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకడని, పట్టుబడిన పేలుడు పదార్థాలను అక్రమంగా సమకూర్చడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసులో పెద్ద కుట్రతో పాటు పేలుడు పదార్థాల అక్రమ కొనుగోలు, తరలింపుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొంది.

కాగా.. ఈ కేసులో శుక్రవారం కర్ణాటకలోని విజయపురలో మరో ముగ్గురు నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 10కి చేరింది. మలప్పురం జిల్లా చెమ్మాడ్‌–తలప్పర రహదారిపై ఉన్న ఫర్హా హాలో బ్రిక్స్‌ కంపెనీ ప్రాంగణంలో నిలిపి ఉంచిన లారీలో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో 89,600 పేలుడు కడ్డీలు, 10,500 షాక్‌ ట్యూబులు ఉన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి కోసం సమకూర్చారు? వాటిని ఎక్కడికి తరలించాలనుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. మొత్తం కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.