ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

  • ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  • ఆధార్‌, ఇతర పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్‌ డీకే బాలాజీ
  • కలెక్టరేట్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గిరిజనులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కార్డు సహా అవసరమైన పత్రాలను భద్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివారం కృష్ణా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సంత్ సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు, చెంచులక్ష్మి, వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇల్లు, రేషన్ కార్డు, పెన్షన్, రుణాలు, ఉపాధి అవకాశాలు, పిల్లలకు విద్య, కోచింగ్ తదితర ప్రయోజనాలను అందించేందుకు ఆధార్ కార్డు సహా అవసరమైన పత్రాలు కీలకమని తెలిపారు. ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ దానిని పోగొట్టుకోవడం వల్ల కొత్తగా ఆధార్ పొందడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఆధార్ కార్డు, ఇతర వ్యక్తిగత పత్రాలన్నింటినీ ఒక సంచి లేదా ఫైల్‌లో భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ, వీలైనంత వరకు ఒక గ్రామం లేదా ఒక ప్రాంతాన్ని స్థిర నివాసంగా చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తరచూ నివాస ప్రాంతాలు మారడం వల్ల పిల్లల చదువుకు ఇబ్బందులు కలగడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

గిరిజనులు ఏదైనా సమస్య లేదా అవసరంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు, వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న వివిధ మార్గాలను పరిశీలించి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

గిరిజన పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి..

గిరిజనుల అభివృద్ధిలో విద్య అత్యంత కీలకమని కలెక్టర్ అన్నారు. పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్య వల్ల ఉపాధి అవకాశాలతో పాటు తాము తయారు చేసే ఉత్పత్తుల విలువ, మార్కెట్ ధరలు, లెక్కలు, ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.

తాను గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన అనుభవాలను ప్రస్తావిస్తూ ఛత్తీస్‌గఢ్‌లో చింతపండు సేకరణ సమయంలో గిరిజనులు మధ్యవర్తుల చేతిలో నష్టపోయిన పరిస్థితులను వివరించారు. ప్రాథమిక విద్య, లెక్కలపై అవగాహన లేకపోవడం వల్ల కష్టపడి సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. అందువల్ల గిరిజన యువత విద్యతో పాటు ఆర్థిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

విద్యార్థులకు కిట్లు పంపిణీ

ఈ సందర్భంగా కుసుమహర యువ సేవా సంఘం సౌజన్యంతో జిల్లా కలెక్టర్ గిరిజన విద్యార్థులకు దుప్పట్లు, కండువాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యాపరమైన కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా వారికి ప్రోత్సాహం కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె సత్యవతి, పర్యాటకశాఖ అధికారి జి. రామలక్ష్మణరావు, గిరిజన సంఘ నాయకులు బారోతు జ్యోతిలాల్ నాయక్, కుంభ రవి కిరణ్, కుంభ అయ్యప్ప, కందుల పవన్, మద్దెల పాండురంగారావు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది పి. శివకుమార్, ఈ. సుబ్రహ్మణ్యం, విద్యార్థులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.