మిషన్ భగీరథ లీకేజీ.. చెరువులా మారిన పొలం
వెల్దండ, ఆంధ్రప్రభ: ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో భారీ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. అయితే నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల సమీపంలో పైప్లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతూ వ్యవసాయ పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కొట్ర చౌరస్తా నుంచి మాడుగుల వరకు వెళ్లే తాగునీటి పైప్లైన్ పోతేపల్లి–మహాత్మాగాంధీ తండా మధ్యలో లీకేజీ ఏర్పడింది. దీంతో పెద్దఎత్తున నీరు పొలాల్లోకి చేరుతోంది. అసలే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో నీటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా.. తాగునీరు ఇలా వృథా కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైప్లైన్ లీకేజీ విషయాన్ని సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తండావాసులు ఆరోపించారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, మరమ్మతులు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నిల్వ నీటితో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్లైన్ లీకేజీని తక్షణమే మరమ్మతు చేసి తాగునీటి వృథాను అరికట్టాలని గ్రామస్తులు, తండావాసులు కోరుతున్నారు.
