ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశాం..
- ఇంటింటికీ టీడీపీలో మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం రాష్ట్రంలో అమలు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 45 రోజులు పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొత్తపేటలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని మంత్రి పేర్కొన్నారు.
విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. పెట్టుబడుల ద్వారా పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.
‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలకు చేరవేయడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసి, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టిడిపి నాయకులు బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్, సత్య శ్రీనివాస్, వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్ర రామకృష్ణ, నంబాల శ్రీనివాసరావు, గుండ లక్ష్మణరావు, బాడన వెంకటరమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
