ఇంద్రకీలాద్రిపై భక్తజన ప్రవాహం..

  • ఆషాఢ సారెతో పండుగ వాతావరణం
  • ఆఖరి ఆదివారం అమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు..
  • లక్ష మంది భక్తుల రాకకు అంచనా..
  • అన్ని క్యూలైన్లు ఉచితంగానే దర్శనం…
  • అంతరాలయ, వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా రద్దు..
  • ఎండలోనూ భక్తులకు చల్లని నీరు, మజ్జిగ..

( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం నికి తోడు వారాంతపు సెలవులు ఆఖరి ఆదివారం కావడంతో భక్తుల రాక పెరుగుతోంది. సెలవు రోజు కావడంతో పాటు ఆషాఢ సారె ఉత్సవాల ముగింపు వేళ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సారె బృందాలు భారీగా తరలివచ్చాయి. దీంతో ఇంద్రకీలాద్రి జనసంద్రమై, కొండపై పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, ఘాట్‌రోడ్‌, శ్రీ కనకదుర్గ నగర్‌ మార్గాల ద్వారా భక్తులు ప్రవాహంలా కొండపైకి చేరుకున్నారు. రోజు ముగిసే సమయానికి సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు.

భారీగా పెరిగిన రద్దీ…

భారీగా పెరిగిన రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు వీలైనంత వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల దర్శన టికెట్లను నిలిపివేసి, అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శన క్యూలైన్లుగా మార్చి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. అలాగే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.

ఎండకి ఉపశమనం..

ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే సంచార నీటి డబ్బాల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. ఈవో వి.కె. శీనా నాయక్‌ స్వయంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతించారు.

పటిష్ట బందోబస్తు…

భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రత, రద్దీ నియంత్రణకు ఆలయ యంత్రాంగం, వన్‌టౌన్‌ పోలీసులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టారు. కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తుల మధ్యే ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. పాలకమండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ఆషాఢ సారె ఉత్సవాల ముగింపు వేళ ఇంద్రకీలాద్రిపై నెలకొన్న భక్తి సందడి కనకదుర్గమ్మ అమ్మవారి వైభవాన్ని చాటింది.