ఘనంగా గణపేశ్వరం విజయదుర్గమ్మకు ఆషాఢ సారె

  • 108 మంది మహిళలతో కుంకుమ పూజలు

నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంక మండల పరిధిలోని గణపేశ్వరం గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, లేబాక శివ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గణపేశ్వరం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళలు సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, తినుబండారాలు, నూతన వస్త్రాలతో కూడిన ఆషాఢ సారెను అత్యంత భక్తిప్రపత్తులతో సమర్పించారు. అనంతరం 108 మంది మహిళలు శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా అవనిగడ్డకు చెందిన డాక్టర్ త్రినాథ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయ పీఆర్వో లేబాక శ్యామ్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మహిళలు అమ్మవారికి మంగళహారతులు సమర్పించి కుటుంబాల సుఖసంతోషాలు, గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.