ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీలో పోరాటం
అచ్చంపేట నుంచి ఢిల్లీకి మాల సంఘం నేతలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అచ్చంపేట నుంచి అంబేద్కర్ యువజన సంఘం అచ్చంపేట డివిజన్ అధ్యక్షుడు పాతుకుల శ్రీశైలం, నాయకులు బీసమోల్ల ఆనంద్, దొడ్డి విష్ణు, సల్వాది నందు, కాలే చెన్నయ్య ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టం, రోస్టర్ విధానం అమలు చేస్తోందని వారు ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం కారణంగా మాలలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో నష్టం జరుగుతోందని మాల సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వర్గీకరణలో జనాభా దామాషాతో పాటు సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాలలకు న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి అదనంగా 2 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 20లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని కోరారు. చట్ట సవరణ పూర్తయ్యే వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, పదోన్నతులు నిలిపివేయాలని లేదా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మాలల హక్కుల కోసం తమ వాణిని వినిపిస్తామని పాతుకుల శ్రీశైలం, బీసమోల్ల ఆనంద్ తెలిపారు.
