తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగల సాయన్న

పేదల కోసం పోరాడిన వీరుడిగా పండుగల సాయన్నకు గుర్తింపు
ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు

మక్తల్, ఆంధ్రప్రభ : సంపన్నులు, పెత్తందారుల నుంచి దోచి పేదలకు పంచిపెట్టి వారి ఆకలి తీర్చిన తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగల సాయన్న అని మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు ముదిరాజ్ అన్నారు.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామంలోని ముదిరాజ్ కమిటీ హాల్‌లో ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగల సాయన్న జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగల సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకట్రాములు ముదిరాజ్ మాట్లాడుతూ.. దానధర్మాలు చేస్తూ ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పండుగల సాయన్న సుపరిచితుడయ్యారని అన్నారు. ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, అధికారులు, సంపన్నుల ఆస్తులను తీసుకుని పేదలకు పంచిపెట్టారని పేర్కొన్నారు. ధనవంతుల నుంచి తీసుకుని పేదలకు పెట్టిన పండుగల సాయన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు.

ఆనాటి నిరంకుశ నిజాం పాలనను, అధికారులను ప్రశ్నించి ఎదిరించిన పండుగల సాయన్న.. తన సొంత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే ఆధిపత్య శక్తులైన దేశ్‌ముఖ్‌లు, కరణాలు, పటేళ్లు, భూస్వాములు పథకం వేసి నిజాం ప్రభుత్వంతో సాయన్నను హత్య చేయించారని గుర్తు చేశారు.

పండుగల సాయన్న వీరోచిత గాథను నేటికీ దర్శనం మొగులయ్య వంటి బిక్షుక గాయకులు 12 మెట్ల కిన్నెరపై గానం చేస్తుండటమే ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని వెంకట్రాములు ముదిరాజ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షుడు గడ్డ బుగ్గప్ప, బోడి వెంకటప్ప, పాల కృష్ణయ్య, శేఖర్, రాజు, చెన్నకేశవులు, బోడి ఆంజనేయులు, వాకిటి ఆంజనేయులు, పాల రమేష్, బోడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.