రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
- ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సెంట్రల్ సమరభేరి
- సోమవారం 21 డివిజన్ల నుంచి భారీ ఊరేగింపు
- దాడులు, హామీల విస్మరణపై ప్రజల నిరసన జ్వాల
- ప్రభుత్వం సమాధానం చెప్పలేకే దాడులు
- వైసీపీ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
కేదారేశ్వరరావు పేట, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు, డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన పారదర్శకత లోపంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ హోరెత్తాయి. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్‌లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల నేతృత్వంలో ఈ దీక్షా కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనంతో ఉందన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకుని, అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు టాపర్ ర్యాంక్ రావటం, ఆపై అతని పేరును తొలగించి రెండో ర్యాంక్ నుంచి జాబితాను ప్రారంభించడం వెనుక ఉన్న పారదర్శకత ఎక్కడ అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీల తోలు తీస్తా అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడి పార్టీలోనే రౌడీలు ఉన్నారనడానికి ఈ దాడులే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. విజయవాడలో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో వచ్చి దీక్షా శిబిరంపై దాడి చేసి, టెంట్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి బొండా ఉమా ఎవరు… పోలీసులు చూస్తుండగానే దాడులు జరుగుతుంటే వారు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం అని ధ్వజమెత్తారు.
కేవలం విజయవాడలోనే కాకుండా తిరుపతి, కనిగిరిలలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వంటి నేతల దీక్షా శిబిరాలపై కూడా కూటమి శ్రేణులు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేసి, టెంట్లు పీకివేశారని మండిపడ్డారు. తన హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, మహిళలు, యువకులను గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ అంటూ కించపరచడం దుర్మార్గమని మల్లాది విష్ణు తీవ్ర నిరసన తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో అక్రమాలు జరగలేదని భావిస్తే ప్రభుత్వం తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, నెరవేర్చని హామీలకు నిరసనగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ సమరభేరి మోగనుందన్నారు. ప్రభుత్వ కళ్లు తెరిపించే లక్ష్యంతో ఈ నెల10వ తేదీన సోమవారం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్ల నుంచి నిరసనకారులు, ప్రజలతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించనున్నారన్నారు.ఈ మహా ప్రదర్శన సింగ్‌నగర్ ఆంధ్రప్రభ కాలనీ నుంచి ప్రారంభమై ప్రకాష్ నగర్, పైపుల రోడ్డు మీదుగా కండ్రిక వరకు సాగనుందని తెలిపారు.వైయస్సార్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలను బయటపెట్టడమే కాకుండా, మెరిట్ అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. విజయవాడ నడిబొడ్డున వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత ధర్నా శిబిరంపై ముత్యాలంపాడులో టిడిపి శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఎంప్లాయిస్ యూనియన్ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి,రవిచంద్ర,పేరం త్రివేణి రెడ్డి,మేడేపల్లి ఘాన్సీ రాణి,సిరిశెట్టి రాజా,గుడిసె శ్యామ్,మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
