హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

  • పటిష్టమైన దర్యాప్తుతో నేరం రుజువు చేసిన కలిదిండి పోలీసులు
  • అధికారులను అభినందించిన ఎస్పీ

ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా కలిదిండి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు/మహిళలపై నేరాల విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

కలిదిండి మండలం ఎస్.ఆర్.పి. అగ్రహారం గ్రామం కట్టావానిపాలెంకు చెందిన పెద్దిరాజులు (48) కుటుంబ ఆస్తి విక్రయానికి వ్యతిరేకించిన ఫిర్యాదుదారుడు కట్టా రాము తల్లి కట్టా జయలక్ష్మిని ముందస్తు ప్రణాళికతో పదునైన కత్తితో హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నాటకమాడి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలతో నేరాన్ని రుజువు చేశారు.

ఈ కేసును అప్పట్లో కలిదిండి ఎస్సై వి. వెంకటేశ్వరరావు నమోదు చేయగా, ప్రస్తుత కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ నూతన చట్టాల ప్రకారం సమగ్ర దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్ దాఖలు చేశారు.

నేరం రుజువుకావడంతో నిందితుడు పెద్దిరాజులకు జీవితాంతం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో పనిచేస్తున్న కోర్టు మానిటరింగ్ సెల్ సమర్థవంతమైన సమన్వయంతో ఈ కేసు విచారణ వేగంగా పూర్తై బాధిత కుటుంబానికి న్యాయం అందిందని అధికారులు తెలిపారు.

ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, సీఐ వి. రవికుమార్ పర్యవేక్షణలో కలిదిండి ఎస్సై ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్ సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వ ప్రత్యేక అభియోజకుడు అడ్డేపల్లి నిరంజన్ రావు 21 మంది సాక్షులను విచారించి బలమైన వాదనలు వినిపించగా, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది సమిష్టి కృషితో నిందితుడికి శిక్ష పడేలా చేశారు.

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది, ప్రభుత్వ అభియోజకుడిని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు.