కొండగడపలో కోతుల దాడి.. మహిళకు తీవ్ర గాయాలు

విద్యార్థులు, ప్రజలపై వరుస దాడులు
కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటాం: కమిషనర్ నర్సయ్య

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కొండగడపలో శుక్రవారం కోతులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన తాటిపాముల మానస అనే మహిళపై కోతులు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వెంటనే మానసను మోత్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై కూడా కోతులు దాడి చేశాయని, పంట పొలాల్లోనూ నష్టం కలిగిస్తున్నాయని స్థానికులు తెలిపారు.

కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు, వార్డు కౌన్సిలర్లు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు లెంకల వేణు, అంబటి విజయ్‌కుమార్ తదితరులు డిమాండ్ చేశారు.

కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4 వార్డులకు చెందిన కొండగడప ప్రాంతంలో కోతుల బెడదను వెంటనే నివారించాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు శుక్రవారం మోత్కూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్యకు వినతిపత్రం అందజేశారు.

కోతుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని కమిషనర్‌కు వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ నర్సయ్య.. సమస్యను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు చేపట్టి కోతుల బెడదను నివారిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానికులు లెంకల వేణు, అంబటి విజయ్‌కుమార్, ఎల్. శ్రీను, టీ. యాదగిరి, టీ. నరేష్, వై. మధు తదితరులు పాల్గొన్నారు.