అంతరిక్ష రంగంలో ఆర్జీయూకేటీ బాసర పూర్వ విద్యార్థిని అనూహ్య ప్రతిభ

విక్రమ్-1 ప్రయోగంలో కీలక బాధ్యతలు
అనూహ్యను అభినందించిన ఆర్జీయూకేటీ బాసర వీసీ

బాసర, ఆంధ్రప్రభ : భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్‌ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చారిత్రాత్మక ఘట్టంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌ ట్రిపుల్‌ఐటీ బాసర పూర్వ విద్యార్థిని అలుగోజు అనూహ్య విశేష ప్రతిభ కనబరిచారు. ఈ విజయంతో విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చారు.

ప్రముఖ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో సాంకేతిక విభాగం ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనూహ్య.. ప్రతిష్టాత్మక ప్రయోగానికి అవసరమైన కీలక సాంకేతిక అనుసంధాన వ్యవస్థల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు.

కష్టాలను జయించి అంతరిక్ష శిఖరాలకు

కరీంనగర్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించిన అనూహ్య 2018 నుంచి 2024 మధ్యకాలంలో ఆర్జీయూకేటీ బాసరలో బీటెక్ పూర్తి చేశారు. ఆమె ప్రస్థానం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనూహ్య తల్లి అలుగోజు లతాశ్రీ ఒంటరి మహిళగా వ్యవసాయ పనులు చేస్తూ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. తన పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఆమె చేసిన త్యాగాలు, అందించిన ప్రోత్సాహం అనూహ్యను దేశం గర్వించే స్థాయికి చేర్చాయి.

ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన అనూహ్య సోదరుడు అలుగోజు ఆదిత్య (బీ171255) కూడా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్, రోబోటిక్స్, కృత్రిమ మేధ రంగాల్లో శిక్షణ ఇస్తూ భవిష్యత్ తరాల విద్యార్థులను శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు.

ఒకే కుటుంబంలో తల్లి కష్టానికి ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడం విశేషమని పలువురు అభినందించారు.

ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ఆర్జీయూకేటీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ అలుగోజు అనూహ్య సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నతికి పెద్దపీట వేస్తూ వారిని అంతర్జాతీయ స్థాయి ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడమే విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనూహ్య సాధించిన అసాధారణ విజయం వేలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

సాంకేతిక విద్యను నూతన శిఖరాలకు తీసుకెళ్తూ, భవిష్యత్ దేశ నిర్మాతలైన విద్యార్థులను తయారు చేసేందుకు ఆర్జీయూకేటీ బాసర అహర్నిశలు కృషి చేస్తోందని వీసీ పేర్కొన్నారు.

ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఇ. మురళీదర్శన్, అసోసియేట్ డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు అలుగోజు అనూహ్యను అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.