మానవ హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తా: బి. సురేష్ బాబు
కర్నూలు, ఆంధ్రప్రభ: హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా బి. సురేష్ బాబును నియమించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ. పద్మకర్, జాతీయ కార్యదర్శి ఎం. సునీల్, జాతీయ ఖజాంచి జి. అడివప్ప పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడు బి. సురేష్ బాబుకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బి. సురేష్ బాబు మాట్లాడుతూ, సంస్థ జాతీయ అధ్యక్షుడు తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తానన్నారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు సంస్థ అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
సంస్థ లక్ష్యాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యులందరితో సమన్వయంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యాలయ సిబ్బంది వెంకటరమణ, జిల్లా వాలంటరీ సభ్యుడు బి. గంగాధర్ తదితరులు పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడు బి. సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
